తెలుగు న్యూస్ టుడే ➤ గ్రేటర్ నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్బీనగర్ – అమీర్పేట మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. గవర్నర్ నరసింహన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కలిసి అమీర్పేట – ఎల్బీనగర్ మెట్రో రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అమీర్పేట నుంచి పంజాగుట్ట, అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట మీదుగా ఎల్బీనగర్ వరకు మెట్రో పరుగులు పెడుతుంది. ప్రస్తుతం ఈ ప్రధాన మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలకు తీరనున్నాయి . మెట్రో రైల్ మొదటి కారిడార్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండటంతో 72 కిలోమీటర్ల లక్ష్యంలో 46 కిలోమీటర్లు పూర్తయింది. ఇది దేశంలోనే సేవలందిస్తున్న రెండో పొడవైన మెట్రో కావడం గొప్ప విషయం. దేశంలో ఢిల్లీలో మాత్రమే 252 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందిస్తుండగా, తర్వాత స్థానంలో చెన్నై 35.3 కి.మీ. దూరం సేవలందిస్తున్నది.
ఇప్పటికే మెట్రో ప్రయాణం చేస్తున్నవారితో కలిపితే కొత్త మార్గంలో ప్రయాణించేవారి సంఖ్య లక్షన్నరకు చేరుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులో లేదా ఇతర వాహనాల్లో సుమారు రెండు గంటలపాటు ప్రయాణం సాగే ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలో మెట్రో వల్ల 52 నిమిషాల్లోనే గమ్యం చేరుకునే అవకాశం కలుగుతున్నది. ఇప్పటికే ప్రారంభమైన మెట్రో మార్గం కంటే ఈ మార్గానికి ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అతి త్వరలోనే మూడో కారిడార్లో మిగిలిన 8.5 కిలోమీటర్ల మేర గల అమీర్పేట- శిల్పారామం మార్గాన్ని సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.