తెలుగు న్యూస్ టుడే ➤ అభినేత్రి మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు సినిమా స్వర్ణయుగం నుంచి నేటి వరకు అసమాన నటనకు, అద్వితీయ సౌందర్యానికి, అచ్చమైన తెలుగందానికి ప్రతీక సావిత్రి. ఆ మహానటి పాత్రని పోషించడం అంటే కత్తి మీద సామే. అయినప్పటికి దీనిని ఒక దీక్షగా తీసుకొని సావిత్రి పాత్రలో అసమాన ప్రతిభ కనబరిచింది కీర్తి సురేష్. ఆమె నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం ఇండియన్ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది.
49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు ఈ నెలలో గోవాలో జరగనున్నాయి. హిందీ, తమిళ, మలయాళం, తుళు… ఇలా భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్‌లో మాత్రం భారతదేశం నుంచి నాలుగే చిత్రాల్ని ప్రదర్శనకు ఎంపిక చేశారు. అందులో దక్షిణాది నుంచి ఒక్క `మహానటి`కే స్థానం దక్కటం విశేషం. మహానటికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.