కేంద్ర మంత్రిపై ఈడీ దాడులు

తెలుగు న్యూస్ టుడే ➤ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల హడావుడి జరుగుతోంది , సుజనాచౌదరి మీద ఈడీ దాడులు తెలుగుదేశంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనాచౌదరికి చెందిన వ్యాపారాలపై సోమవారం రాత్రి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. సుజనా చౌదరికి చెందిన 120 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ దాడుల్లో అధికారులు స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకువెళ్లినట్లు తెలిసింది.

అసలే తెలుగుదేశం పార్టీ.. మోడీ సర్కారు కక్ష కట్టి.. తమ పార్టీ వారి మీద ఐటీదాడులు చేయిస్తోందంటూ ఆరోపణలు గుప్పించిన కొన్నిరోజుల వ్యవధిలోనే ఏకంగా కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి ఆస్తుల మీద దాడులు జరగడం విశేషం. ఆయన ఆఫీసులనుంచి మొత్తం 120 కంపెనీల పేరిట ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఆర్థికలావాదేవీల విషయంలో సుజనాచౌదరి మీద ఇదివరలోనూ చాలా ఆరోపణలు ఉన్నాయి. తన కంపెనీలను చూపించి.. విదేశీ బ్యాంకులనుంచి వందలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని, వాటిని ఎగవేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కేసులు కోర్టు వరకు వెళ్లడంతో సుజనా చౌదరి పేరిట అరెస్టు వారంట్లు కూడా వచ్చాయి. అప్పట్లో ఆయన కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అరెస్టు వారంట్లను ఎదుర్కొన్నారు. కోర్టుకు కూడా హాజరయ్యారు. ఇలాంటి నేపథ్యంలో సుజనా చౌదరి ఆఫీసు మీద ఈడీ అధికారులు చేసిన దాడుల్లో.. 120 కంపెనీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకువెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. వీటిలో ఎన్ని నడుస్తున్న అసలు కంపెనీలో, ఎన్ని డొల్ల కంపెనీలో తేలవలసి ఉంది.

Leave a Comment