రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు !

తెలుగు న్యూస్ టుడే ➤ ఓటుకు నోటు కేసులో … తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కలసి 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌తోపాటు ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ ఈ బృందాలు సోదాలు జరిపాయి. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న ఆస్తులు, చెల్లిస్తున్న ఆదాయపన్నుకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించింది.

రేవంత్‌రెడ్డి, ఆయన భార్య గీత, కుమార్తె నైమిషారెడ్డి పేరుతో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ పూర్తిస్థాయిలో వివరాలు సేకరించింది. వారి బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున జమ అవుతున్న నగదుతోపాటు విదేశాల నుంచి నగదు తరలించినట్లు వచ్చిన ఫిర్యాదులపైనా విచారించింది. రేవంత్‌ బినామీ ఆస్తులు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు, ఆయన బ్యాంకు ఖాతాలు, విదేశాల నుంచి తరలించిన నగదు వంటి వివరాలను ఈడీ సేకరించింది.

కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ రావాల్సిందిగా ఐటీ అధికారులు ఆదేశించారు. దీంతో మధ్యలోనే ప్రచారాన్ని ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తన నివాసానికి వచ్చిన రేవంత్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. తాము ప్రశ్నించిన అంశాలపై ఓ నోట్‌ను రేవంత్‌రెడ్డికి ఇచ్చి, వీటికి తగిన డాక్యుమెంట్లు ఉంటే చూపించాలని కోరారు. రేవంత్‌ సోదరుడు కొండల్‌రెడ్డి, ఆయన భార్యను కూడా అధికారులు ప్రశ్నించారు. వీరిద్దరి పేర్ల మీద ఉన్న భూపాల్‌ కన్‌స్ట్రక్షన్స్, పలు కంపెనీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కంపెనీలకు సంబంధించి ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. అన్నిచోట్లా తెల్లవారుజాము వరకు జరిగిన ఈ తనిఖీలు.. శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉంది.

Leave a Comment