టీడీపీ నాయకుడు సీఎం రమేశ్‌ నివాసంలో ఐటీ సోదాలు

తెలుగు న్యూస్ టుడే ➤ వరుస దాడులు అధికార టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి. టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడలో ఏకకాలం‍లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం రమేశ్‌ బంధువు గోవర్ధన్ నాయుడు ఇంట్లోనూ ఐటీ సోదాలు సాగుతున్నాయి. సీఎం రమేశ్‌కి దగ్గర బంధువైన గోవర్ధన్ నాయుడు కాంట్రాక్టర్‌గా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం రమేశ్‌ పలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం సీఎం రమేశ్‌ ఢిల్లీలో ఉన్నారు.సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చంద్రబాబు సర్కారు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులను నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చేసినట్టు వెల్లడించాయి.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై కూడా ఆదాయ పన్నుల శాఖ అధికారులు గతవారం దాడులు నిర్వహించారు. ‘బీఎంఆర్‌’ గ్రూప్‌ పేరుతో వ్యాపారాలు చేస్తున్న ఆయన ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. వరుస దాడులు అధికార టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి. తాము చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోమోనని సైకిల్‌ పార్టీ నేతలు వణికిపోతున్నారు

Leave a Comment