ఆంధ్రాలో ఐటీ దాడులు !

తెలుగు న్యూస్ టుడే ➤ ఐటీ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసు విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు రేవంత్‌, అతని అనుచరుల ఇళ్లపై దాడి చేసిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు, మంత్రుల ఇళ్లను టార్గెట్‌ చేసినట్లు సమాచారం. పోలీసుల బందోబస్తుతో గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు . కానూరులోని నారాయణ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయానికి ఐటీ అధికారులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఐటీ దాడుల వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ విద్యాసంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని తెలిపారు. గతంలోనే ఆదాయపుపన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు నారాయణ సంస్థలకు నోటీసులిచ్చారు. ట్రస్ట్‌ ద్వారా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నట్లు నారాయణ యాజమాన్యం వివరణ కూడా ఇచ్చింది.

అలాగే సదరన్‌ డెవలపర్స్‌, వీఎస్‌ లాజిస్టిక్‌ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వీఎస్ లాజిస్టిక్స్ గుంటూరులో రైల్వేకోచ్‌ల మరమ్మతులు, రైల్వే నిర్మాణ పనులకు సబంధించిన కాంట్రాక్టులు చేస్తోంది. విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరులో ఈ రెండు సంస్థల కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అమరావతి, పోలవరం కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టు పనులను సదరన్ డెవలపర్స్ నిర్వహించినట్లు సమాచారం. విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ఐటీ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి మొత్తం పది బృందాలుగా అధికారులు తనిఖీలకు వెళ్లారు.

రేవంత్‌ రెడ్డి ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ నగదును ఏపీ నేతలే అందించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ అవినీతి సొమ్ముతోనే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో భారీగా ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మంత్రి ద్వారానే డబ్బును తెలంగాణకు పంపినట్లు ప్రచారం కూడా జరిగింది. అంతేకాకుండా కర్ణాటక, తాజాగా తెలంగాణ ఎన్నికలకు కూడా ఏపీ నుంచే వందల కోట్లు పంపారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఐటీ అధికారులు గత రాత్రి పోలీసుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుంచి 10 బృందాలుగా ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Comment