ఆయుష్ వైద్యులకు అండగా ఉంటాం : కేటీఆర్ !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ ప్రభుత్వ హయాంలో వైద్య రంగం పురోభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆరోగ్య తెలంగాణ లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. అందుకే ప్రభుత్వపరంగా ప్రజారోగ్యం కోసం దవాఖానలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.  తెలంగాణ రాకముందు వైద్యశాఖకు రూ.నాలుగువేల కోట్లు బడ్జెట్ ఉండేదని, ప్రస్తుతం రూ. ఏడువేలకోట్లకు పెంచామని గుర్తుచేశారు. ఆయుష్ బలోపేతానికి మరిన్ని నిధులు పెంచుతామని చెప్పారు. తెలంగాణ ఆయుష్ (ఆయుర్వేద, హోమియో, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ) వైద్యసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్‌లో ఆయుష్ డాక్టర్స్ విత్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆయుష్ వైద్యులకు అస్తిత్వాన్ని కోల్పోతామేమోనని, భవిష్యత్‌లో ఆదరణ ఉండదనీ ఆందోళన అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.  దేశంలోకి అల్లోపతి వైద్యం రాకముందు ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతికి ప్రాధాన్యం ఉన్నదని, ఈ వైద్యానికి ప్రజల గుండెల్లో ఎప్పటికీ సుస్థిరస్థానమేనన్నారు. ఆయుష్ బలోపేతానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి వైద్యుల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఆయుష్‌లో 1998 తర్వాత నియామకాలు జరుగలేదని, ఇటీవల నియామక ప్రక్రియ ప్రారంభించినట్టు మంత్రి లకా్ష్మరెడ్డి చెప్పారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎస్ వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైద్యులు రామకృష్ణ, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment