హైద్రాబాద్ కూకట్ పల్లిలో ఉద్రిక్తత

హైద్రాబాద్ న్యూస్ ➤ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ ఫస్టియర్‌ చదువుతున్న రమ్య . అదే కాలేజ్ కు చెందిన బస్సే తన ప్రాణాలను హరిస్తుందని తెలుసుకోలేకపోయింది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి విద్యార్థిని బలైంది. తోటి విద్యార్థులు ఆగ్రహించటంతో కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రమ్య ఈ ఉదయం కాలేజీకి వెళ్లడానికి కూకట్‌ పల్లి బీజేపీ ఆఫీస్‌ వద్ద రోడ్డు దాటుతుండగా శ్రీ చైతన్య కాలేజీకి చెందిన బస్సు ఆమెను ఢీకొంది.

దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. శ్రీ చైతన్య కాలేజీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆగ్రహించారు. దాదాపు 10 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేయటానికి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. కూకట్‌పల్లిలోని కాలేజీలను విద్యార్థులు బంద్‌ చేయిస్తూ నిరసన తెలియజేస్తున్నారు.

Leave a Comment