గ్రేటర్ హైదరాబాద్ తో మైక్రాన్ టెక్నాలజీ ఒప్పందం

హైద్రాబాద్ న్యూస్ ➤ నాలుగున్నఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో ఇప్పటికే పలు కంపెనీలు హైదరాబాద్‌కు క్యూకట్టాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ప్రత్యేక చొరవతో అనేక సంస్థలు దేశంలోనే మొదటిసారిగా తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించి వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సెమీ కండక్టర్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ సంస్థ ముందుకొచ్చింది. త్వరలోనే ఈ సంస్థ హైదరాబాద్‌లో భారీ ఎత్తున తన కార్యకలాపాలు చేపట్టనున్నది.

ఇప్పటికే సింగపూర్, తైవాన్, జపాన్, చైనా, మలేషియాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత్‌లో విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో మైక్రాన్ సంస్థ సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ డ్రేక్, డైరెక్టర్ అమరేంద్ సిధూలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో రూ.300 కోట్ల పెట్టుబడితో 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్టు వివరించారు. కంపెనీ విస్తరణకు మాదాపూర్‌లో సుమారు 1.80 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. మైక్రాన్, క్రూసియల్, బాలిస్టిక్ వంటి అనేక గ్లోబల్ బ్రాండ్లను తమ కంపెనీ కలిగి ఉన్నదని, మెమొరీ ఆధారిత టెక్నాలజీలు తమ సొంతమని ఈ బృందం వివరించింది.

ఈ కార్యక్రమానికి నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment