గల్ఫ్ భాదితులకు అండగా కేటీఆర్ !

తెలుగు న్యూస్ టుడే ➤ క్షమాభిక్ష ద్వారా మూడోవిడుతలో మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న బాధితులకు శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ద్వారా స్వదేశానికి వస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎన్నారై వ్యవహారాలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. ప్రైవేట్‌రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నదని చెప్పారు. గల్ఫ్ బాధితులకు వాటిల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇందుకు వివిధ సంస్థలతోపాటు న్యాక్‌లో శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

ఆమ్నెస్టీ ద్వారా సాధ్యమైనంత ఎక్కువమందిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని గతవారం యూఏఈకి పంపించింది. ఈ బృందం అక్కడి తెలంగాణ సంఘాలు, భారత రాయబార కార్యాలయ అధికారులతో కలిసి ఆమ్నెస్టీ సదుపాయాన్ని సాధ్యమైనంత ఎక్కువ మంది ఉపయోగించుకునేలా చర్యలు తీసుకున్నది. మంగళవారం టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, సామాజిక కార్యకర్త నాయుడు ఆధ్వర్యంలో మూడోవిడుతలో 30 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరికి మంత్రి కేటీఆర్ స్వయంగా స్వాగతం పలికి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమ్నెస్టీ ద్వారా స్వదేశానికి వచ్చే సమయంలో టికెట్ కొనుగోలుతోపాటు చిన్నచిన్న జరిమానాలను చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేక అనేకమంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి ఇప్పటికే అవసరమైనవారికి ప్రభుత్వం టికెట్లు సమకూర్చిందని, జరిమానాల విషయంలోనూ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. యూఏఈ నుంచి బాధితులను తెలంగాణకు తీసుకురావడానికి శ్రమిస్తున్న ప్రొటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్‌సింగ్, ఎన్నారైశాఖ అధికారులు చిట్టిబాబు, రషీద్, టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, సామాజిక కార్యకర్త నాయుడు తదితరులను మంత్రి అభినందించారు.

గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులతో మరోసారి సమావేశమవుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేట్‌రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని, ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి వచ్చిన కార్మికులకు ఇక్కడే వివిధ స్థాయిల్లో ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాధితులకు వాహనాలు సమకూర్చి ఇండ్ల వద్ద వదిలిపెట్టాలని ప్రొటోకాల్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆమ్నెస్టీ అవకాశాన్ని ఉపయోగించుకోనివారు తెలంగాణ ఎన్నారై శాఖ ఫోన్ నంబర్- 9440854433 ద్వారా సహాయం పొందాలని మంత్రి కేటీఆర్ కోరారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తాజామాజీ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, పువ్వాడ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment