కల్యాణ్‌రామ్ విడుదల చేసిన అరవిందసమేత ట్రైలర్ !

 

తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం అరవిందసమేత. వీరరాఘవ ఉపశీర్షిక. త్రివిక్రమ్ దర్శకుడు. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో కల్యాణ్‌రామ్ విడుదలచేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనేది నా పన్నెండేళ్ల కల. ఇన్నేళ్ల ప్రయాణంలో త్రివిక్రమ్‌లో ఓ మంచి స్నేహితుడిని, దర్శకుడిని చూశాను . ఈ సినిమా ముగిసేలోపు ఆత్మబంధువుగా మారిపోయారు. విషాద సమయంలో నాకో సోదరుడిగా, తండ్రిగా అండగా నిలిచారు. నా జీవితంలో నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో ఈ చిత్రం ముడిపడి ఉంది. త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెట్టిన తర్వాతే జీవితం విలువ తెలిసింది.

ఆ పరిపక్వత రావడానికే ఇన్నాళ్లు వేచి చూసి సరైన సమయంలో భగవంతుడు నాతో ఈ సినిమా చేయించాడు. నాకు ఎలాంటి కష్టం వచ్చినా అభిమానులందరితో పాటు త్రివిక్రమ్ నా వెన్నంటి నిలుస్తాడు. నా జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులోనే దాచుకున్నాను. ఆడియో వేడుకల్లో తాతయ్య పోస్టర్ చూసేవాణ్ణి. కానీ నాన్న ఫొటోను ఇంత తొందరగా చూడాల్సివస్తుందని అనుకోలేదు. ఓ తండ్రికి ఆయనకంటే అద్భుతమైన కొడుకు వుండడు. ఓ కొడుక్కు ఆయనకంటే అద్భుతమైన తండ్రి వుండడు. నాన్నకు ఇచ్చిన మాటే మీకు ఇస్తున్నాను. మా జీవితం మీకు అంకితం చేస్తున్నాం అని అన్నారు

కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ త్రివిక్రమ్, తమ్ముడి కలయిక కోసం పదేళ్లుగా నాతో పాటు ఎదురుచూసిన అభిమానులందరిని ఈ సినిమా అలరిస్తుంది. నాన్న దూరమవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ నిర్మాత బాగుండాలని, ఇచ్చిన మాటకు నిలబడాలని నాన్న చనిపోయిన ఐదవ రోజునే తమ్ముడు షూటింగ్‌కు హాజరయ్యారు. భౌతికంగా నాన్న దూరమైనా మా మనసుల్లో ఉండిపోయారు. అభిమానుల రూపంలో నాన్నను చూస్తూ ఆనందపడతాం అని తెలిపారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే అందంగా ఉంటుంది.
ఈ రోజు అదే భావన కలుగుతున్నది. సినిమా అభిమానులకు నచ్చాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ ప్రీరిలీజ్ వేడుకలో తండ్రి హరికృష్ణను తలచుకొని ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

Leave a Comment