జాతీయ క్రీడా పురస్కారాలలో తెలుగు తేజాలు !

తెలుగు న్యూస్ టుడే ➤ జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం అత్యంత కన్నులపండువగా..అట్టహాసంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా క్రీడాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు అవార్డులను గెలుచుకున్నారు . ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావు ద్రోణాచార్య అవార్డు స్వీకరించారు.

ఖేల్ రత్న పురస్కార గ్రహీతకు పతకం, ప్రశంసాపత్రంతోపాటు రూ.7లక్షల50వేలు, అర్జున అవార్డు గ్రహీతలకు అర్జున ప్రతిమతోపాటు రూ.5లక్షల నగదు పురస్కారం అందజేశారు. గతనెల 29వ తేదీ జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా జరగాల్సిన కార్యక్రమం ఆసియా క్రీడల సందర్భంగా వాయిదా వేశారు. ఖేల్ రత్న అందుకున్న విరాట్ కోహ్లీని, అర్జున సత్కారం పొందిన మహిళా క్రికెటర్ స్మృతి మంధనను బీసీసీఐ అభినందించింది.

రాష్ట్ర అథ్లెట్ సిక్కిరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. మోకాలి గాయంతో సింగిల్స్ నుంచి పూర్తిగా వైదొలిగి డబుల్స్‌కే పరిమితమైనా..అర్జున పురస్కారంతో తనకు సాటి లేదని నిరూపించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి ఆడుతున్న మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్‌తో కలిసి విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో జట్టు టీమ్ విభాగంలో స్వర్ణం గెలవడంలో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డిదే ప్రధాన పాత్ర. ఓరుగల్లు నుంచి రాజధానికి చేరిన సిక్కిరెడ్డి కెరీర్‌లో అద్భుత ప్రదర్శనతో అర్జున అవార్డు గెలుచుకోవడం విశేషం. ప్రస్తుత భారత బ్యాడ్మింటన్ జట్టులో స్వర్ణయుగం నడుస్తుందని చెప్పొచ్చు.

Leave a Comment