విఠలాచార్య సెట్ లో డైరెక్టర్ శంకర్ !

 

తెలుగు న్యూస్ టుడే ➤ ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. నందమూరి బాల‌కృష్ణ ఆయ‌న తండ్రి జీవిత నేప‌థ్యంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్‌. అయితే ఒక‌వైపు చిత్రీక‌ర‌ణ జ‌రుపుతూనే మ‌రోవైపు చిత్రంలోని కీల‌క పాత్ర‌ల‌ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నారు క్రిష్‌. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య క‌నిపించ‌నుండగా ఆయన సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుంది. ఇక‌ ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తున్నాడు. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి పాత్రను విజయవాడకు చెందిన హిమాన్సి చౌదరి  పోషిస్తుందని స‌మాచారం.

ఎన్టీఆర్ జీవితంలో అనేక కీల‌క ఘ‌ట్టాలు ఉండగా, కొన్ని ముఖ్య పాత్ర‌ల కోసం ప్ర‌ముఖుల‌ని ఎంపిక చేస్తున్నాడు క్రిష్‌. ఆ కాలం లెజండరీ దర్శకుడు విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ శంకర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. మరో రెండు నెలల్లో ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Leave a Comment