అత్యుత్తమ కంపెనీగా సింగరేణి సంస్థ

తెలుగు న్యూస్ టుడే ➤తెలంగాణా మణి హారం ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సింగరేణి సంస్థ.. తాజాగా భారత అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు పేరుతో ఏటా అవార్డు అందించే అమెరికాకు చెందిన బెర్క్‌షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ 2018 సంవత్సరానికి సింగరేణి కాలరీస్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు సంస్థ సీఈవో హేమంత్, వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ వాల్ష్ ప్రకటించారు. మార్చి 8వ తేదీన ముంబైలోని లీలా హోటల్‌లో కార్యక్రమానికి హాజరై అవార్డును స్వీకరించాల్సిందిగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్‌ను ఆహ్వానించారు.

బెర్క్‌షైర్ సంస్థ ఏటా భారతదేశంలోని కంపెనీల పనితీరు, వృద్ధిని అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీకి అవార్డు ప్రకటిస్తుంది. గతంలో ఎల్‌అండ్‌టీ, హిందుస్తాన్ లివర్, రిలయన్స్, టాటా కన్సెల్టెన్సీ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ తదితర కంపెనీలు ఈ అవార్డును అందుకున్నాయి. సింగరేణి కాలరీస్ అత్యంతవేగంగా వృద్ధిచెందుతూ భారతదేశ ఆర్థికప్రగతిలో తనదైన పాత్ర పోషిస్తుండటాన్ని గుర్తించి.. ఇండియాస్ బెస్ట్ కంపెనీగా నిపుణుల కమిటీ ఎంపిక చేసిందని సంస్థ తెలిపింది. సింగరేణి సంస్థ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 620 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడంతోపాటు 646 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. రూ.22,667 కోట్ల టర్నోవర్‌తో రూ.1200 కోట్ల లాభాలను సాధించింది. 2013-14తో పోలిస్తే 34 శాతం వృద్ధి నమోదుచేసింది. బొగ్గు ఉత్పత్తిలో 22.9 శాతం, లాభాల్లో 186 శాతం వృద్ధిని సాధించింది. ఇలా ఎన్నో విజయాలకు గుర్తింపుగా సింగరేణికి అత్యుత్తమ పురస్కారాన్ని ప్రకటించామని బెర్క్‌షైర్ మీడియా సంస్థ తెలిపింది.

Leave a Comment