బతుకమ్మ పండుగకు ముస్తాబైన తెలంగాణ !

తెలుగున్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా దేవతలు దీవెనలివ్వాలని సీఎం ఈ సందర్భంగా ప్రార్థించారు. అదేవిధంగా బతుకమ్మ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దేవాలయాలు, చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువుల వద్ద దీపాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మంగళవారం నుంచి 17 వరకు జరిగే వేడుకల ప్రారంభ కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి.

హైదరాబాద్‌లోని బైసన్‌పోలో గ్రౌండ్స్, పరేడ్‌గ్రౌం డ్స్, పీపుల్స్‌ప్లాజా, తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లలో ప్రత్యేక సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరిగే పారామోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 9 నుంచి 16 వరకు రవీంద్రభారతి వేదికగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికగా బతుకమ్మ ఆట – పాట, కోలాటం ప్రదర్శిస్తారు. 9వ తేదీ నుంచి ఆక్టోబర్ 16 వరకు ప్రతిరోజు బతుకమ్మ ఫిల్మోత్సవం, 30 మందితో ఐదురోజులపాటు ప్రత్యేక ఆర్ట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. 15న హైటెక్స్‌లో దివ్యాంగులతో స్పెషల్ బతుకమ్మ, 7, 8, 9 తేదీల్లో శిల్పారామంలో జపాన్ స్టెల్‌లో పుష్పాల ప్రదర్శన, మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 55 మంది కళాకారులు పాల్గొనే ప్రత్యేక వేడుకలు.

17న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకకు లేజర్‌షో, 1000 మంది జానపద కళాకారుల ప్రదర్శనతోపాటు సామూహికంగా బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. రవీంద్రభారతిసహా ఇతర ప్రాంతాల్లో నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకల్లో రష్యా, అజర్‌బైజాన్, కజికిస్థాన్ తదితర 21 దేశాలకు చెందిన మహిళా కళాకారులు పాల్గొననున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మానేరు నది ఒడ్డున రూ.1.60 కోట్ల తో ప్రత్యేకంగా నిర్మిస్తున్న బతుకమ్మ ఘాట్ సద్దుల బతుకమ్మనాటికి అందుబాటులోకి రానున్నది. ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 40 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఈ ఘాట్‌ను అతిసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనాన్ని వీక్షించేందుకు విశాలమైన ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ రోజు వెయ్యి మంది ఆడుకునేలా పక్కనే స్థలాన్ని చదును చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి మానేరు వరకు సీసీరోడ్డు నిర్మిస్తున్నారు. బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి సోమవారం సందర్శించారు.

Leave a Comment