తెలుగు న్యూస్ టుడే ➤తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన రైతుబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు రాష్ట్ర సర్కార్ . ఈ పథకంలో భాగంగా సోమవారం తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.150 కోట్లు జమయ్యాయి. రాష్ట్ర శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేపట్టవద్దన్న ఎన్నికల కమిషన్ సూచనలను పాటిస్తూ వ్యవసాయశాఖ ఆన్లైన్ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సొమ్మును జమచేస్తున్నది. గతంలో గ్రామసభల ద్వారా 51 లక్షల మంది అన్నదాతలకు ప్రభుత్వం చెక్కులను పంపిణీచేసిన విషయం విదితమే. యాసంగిలో ఈ పథకానికి 52 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి వారి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించిన వ్యవసాయశాఖ.. తొలిదశలో 5 లక్షల మంది ఖాతాల్లో సొమ్మును జమచేసేందుకు ఏర్పాట్లు చేసింది.
ఈ మేరకు తొలిరోజు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), రంగారెడ్డి ట్రెజరీ ఎకౌంట్ నుంచి 1.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బును జమచేసి ఆ సమాచారాన్ని సంక్షిప్త సందేశాల (ఎస్సెమ్మెస్‌ల) రూపంలో లబ్ధిదారులకు తెలియజేసింది. మిగిలిన రైతుల ఖాతాల్లో మంగళవారం సుమారు రూ.500 కోట్లు జమచేసి వారికి కూడా ఎస్సెమ్మెస్‌లు పంపనున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి ట్రెజరీ నుంచి ఆంగ్లంలో, ఆర్బీఐ నుంచి తెలుగులో ఈ ఎస్సెమ్మెస్‌లు వస్తాయని, ఈ విషయంలో రైతులెవరూ అయోమయానికి గురికావద్దని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు సూచించారు.