తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా తెలుగు హీరో

తెలుగు న్యూస్ టుడే ➤ ఉత్తరాంధ్ర తిత్లీ తుపాను ధాటికి అతలాకుతలమైన సిక్కోలు వాసులకు అండగా, సహాయం చేయడానికి తాము సైతం అంటూ తెలుగు హీరోలు ముందుకొచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుపాను సృష్టించిన బీభత్సం వ‌ల‌న నిరాశ్ర‌యిల‌యిన వారికి అండ‌గా నిలిచేందుకు ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్, క‌ళ్యాణ్ రామ్‌, సంపూర్ణేష్ బాబు త‌దిత‌రులు న‌గ‌దుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి అందజేశారు. తాజాగా యువ హీరో నిఖిల్ సిద్ధార్ధ తితిలీ ప్ర‌భావిత ప్రాంతానికి వెళ్ళి వారిని ప‌రామ‌ర్శించ‌డంతో పాటు అక్క‌డే ఉండి అంద‌రికి త‌న వంతు సాయాన్ని అందించాడు. మూడు వేల మందికి భోజ‌న స‌దుపాయం క‌లిపించిన నిఖిల్ 2500 కిలోల రైస్ , 500 దుప్పట్లు, పవర్ కట్స్‌ని నివారించేందుకు పోర్టబుల్ జనరేటర్స్ కూడా అందించాడు.

ప్రస్తుతం తాను శ్రీకాకుళం జిల్లా గుప్పిడిపేట గ్రామంలో ఉన్నానని.. అనంతరం తాను పల్లిసారధి గ్రామానికి వెళ్లనున్నానని నిఖిల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. అయితే నిఖిల్ స్వయంగా తమ గ్రామాలకు వచ్చి సాయమందించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ప్ర‌స్తుతం ముద్ర అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. టీఎన్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైన‌మిక్స్‌, ఎల్ఎల్‌పి ప‌తాకాల‌పై కావ్య వేణుగోపాల్‌, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Leave a Comment