ఉత్తరాంధ్రకి వాయుగండం !

తెలుగు న్యూస్ టుడే ➤ ఉత్తరాంధ్రకి వాయుగండం పొంచివుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింతగా బలపడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉంది. గురువారంలోగా వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆ వెంటనే మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశావైపు ప్రయాణిస్తుందని తెలిపారు. గురు, శుక్రవారాల్లో కళింగపట్నం, పూరి మధ్య తీరం దాటొచ్చని వివరించారు. ఈ ప్రభావంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల, ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంకట 55కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. గుంటూరు, మెంటాడ, జంగమహేశ్వరపురంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం బలపడిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సూచించింది. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. మరోవైపు శ్రీకాకుళం (కోటబొమ్మాళి, మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట, టెక్కలి), విశాఖపట్నం (భీమునిపట్నం, గాజువాక, జి.మాడుగుల, జీకేవీధి, ముంచంగిపుట్టు, పెద్దబయలు, పెదగంట్యాడ, పెందుర్తి, విశాఖపట్నం), విజయనగరం (భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ)లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ తెలియజేసింది.

Leave a Comment