తెలుగు న్యూస్ టుడే ➤ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం దొరికినా నొక్కేసే రోజులివి. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఇరవై తులాల బంగారం అందులో ఉంది. దొరికిన బంగారు నగల బ్యాగును … అడ్రస్ వెతికి మరీ ఓనర్ కే ఇచ్చేశారు. అలా… విలువలను నిలబెట్టి…. నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో మరోసారి నిరూపించారు తెలంగాణా రాష్ట్ర పోలీసులు.
ఘట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రవి శంకర్ అనే వ్యక్తికి ఓ మెరున్ కలర్ బ్యాగ్ కనిపించింది. వెంటనే అతను.. అనుమానంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పక్కనే ఉండటంతో.. వాహనంలో వెంటనే స్పాట్ కు చేరుకున్నారు సీఐ రఘువీర్ రెడ్డి టీమ్. పోలీసులు బ్యాగ్ ఓపెన్ చేశారు. అందులో.. పెండ్లి పత్రికలతోపాటు.. 20 తులాల బంగారు నగలు కనిపించాయి.
అన్నీ కొత్త నగలు. బాక్సుల్లో పెట్టి ఉన్నాయి. బ్యాగ్ లో నగల బిల్ ఆధారంగా షాప్ యజమానికి ఫోన్ చేశారు పోలీసులు. అక్కడినుంచి.. వాటిని కొనుగోలు చేసిన వాళ్ల ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో… నగలు పోగొట్టుకున్న బాధితురాలు సమీర స్టేషన్ కు వచ్చారు. ఆలేరుకు చెందిన సమీర కుటుంబసభ్యులు.. వ్యాగనార్ కారు పైన బ్యాగ్ పెట్టుకుని సికింద్రాబాద్ వెళ్తుండగా వరంగల్ హైవేపై ఈ బ్యాగ్ మిస్సయింది. బ్యాగ్ ను ఎలా పోగొట్టుకున్నదీ… అందులో ఏమేంఉన్నాయో అన్నీ వివరించి పోలీసులకు చెప్పారు. వివరాలు సరిపోవడంతో… బంగారం ఉన్న బ్యాగ్ ను యజమానులకు అప్పగించారు పోలీసులు. పోయాయనుకున్నవి దొరకడంతో… బాధితులు సంతోషపడ్డారు. బ్యాగ్ ఆచూకీ చెప్పిన రవిశంకర్ ను డిపార్టుమెంట్ తరఫున నగదు ప్రోత్సాహకంతో అభినందించారు సీఐ రఘువీర్ రెడ్డి.