బతుకమ్మ పండుగకు టీఎస్ఆర్టిసి 4వేల బస్సులు

తెలుగు న్యూస్ టుడే ➤తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల హడావుడి మొదలైయింది. టీఎస్ఆర్టీసీ సొంతూళ్లకు వెళ్లే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది . హైదరాబాద్ నగరం నుంచి ముఖ్యకూడళ్లతోపాటు శివార్ల నుంచి 4 వేల అదనపు బస్సులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు సీమాంధ్రలోని ముఖ్యప్రాంతాలకు నడపడానికి ప్రణాళికలు రూపొందించింది ఆర్టీసీ. దసరా ఆపరేషన్స్‌పై రంగారెడ్డి రీజియన్‌లోని ఎంజీబీఎస్‌లో నిన్న(గురువారం) ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొమురయ్య సమీక్షించారు. ఈ సందర్భంగా రెగ్యులర్ బస్సులతోపాటు అదనపు బస్సులు నడిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య ప్రాంతాలకు ఈనెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్పెషల్ బస్సులను నడుపనున్నారు. పండుగల ముందు 16, 17,18,19 తేదీల్లో అధిక బస్సులు తిప్పనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయడంతోపాటు సూపర్‌వైజింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని ఆదేశించారు ఈడీ కొమురయ్య.
గౌలిగూడ హ్యాంగర్ కూలిపోవడంతో ఇక్కడినుంచి ప్రతీ పండుగకు బయల్దేరే బస్సులను కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి నడుపనున్నారు. కర్నూలు, కడపలకు వెళ్లే బస్సులు కాచిగూడ స్టేషన్ నుంచి వెళ్తాయి. ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వరంగల్ రూట్లో ఉన్న జిల్లాలకు బయల్దేరి వెళ్తాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు జేబీఎస్ నుంచి వెళ్తాయి. దిల్‌సుఖ్‌నగర్, విక్టోరియా గ్రౌండ్స్ నుంచి నల్గొండ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు మార్గంలో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు(ఆపరేషన్స్) కొమురయ్య, రంగారెడ్డి రీజియన్ యాదగిరి, సీటీఎం మునిశేఖర్, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ శివకుమార్, రాఘవేందర్‌రెడ్డి, కరీంనగర్ ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ లు పాల్గొన్నారు.

Leave a Comment