సాగర తీరంలో అంతర్జాతీయ సాంకేతిక పండగ

తెలుగు న్యూస్ టుడే ➤ విశాఖ సాగర తీరం మరో అంతర్జాతీయ సాంకేతిక పండగకు వేదికైంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ కోసం ముస్తాబైంది. సాగర తీరంలో నోవొటల్‌ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ ఫెస్టివల్‌లో సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే టెక్నాలజీలపై 15 దేశాల నుంచి తరలివచ్చే నిపుణులు విస్తృత చర్చలు జరుపుతారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్టార్టప్‌ కంపెనీలు ఇక్కడ  ప్రదర్శనలు ఇస్తాయి. హ్యూమన్‌ రోబో ’సోఫియా‘ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా ఈ వేడుకల్లో నిలవనుంది.
ఫిన్‌టెక్‌ సెక్టార్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం అగ్రగామిగా ఉంది. సమీప భవిష్యత్‌లో ప్రపంచంలోనే ఫిన్‌టెక్‌ సెక్టార్‌లో ఏపీ నెంబర్‌ వన్‌గా నిలవాలన్న సంకల్పంతో ఈ ఫెస్టివల్‌కు విశాఖలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బిలియన్‌ డాలర్ల చాలెంజ్, హాక్‌థాన్, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ఫైనల్‌కు వచ్చిన బెస్ట్‌ స్టార్టప్‌ సంస్థలు తాము తీసుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తారు.
ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ కోసం ఫిన్‌థాన్‌ పేరిట దేశ విదేశాల్లో వన్‌ మిలియన్‌ డాలర్‌ చాలెంజ్‌ పేరిట పోటీలను నిర్వహించింది. సుమారు వెయ్యి స్టార్టప్‌ బృందాలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేయగా 400 విద్యార్థి బృందాలు పోటీపడ్డాయి. వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన 40 బృందాలను ఎంపిక చేశారు. వీరికి విశాఖలో జరిగే ఫిన్‌టెక్‌ కాన్ఫరెన్స్‌లో పోటీలు నిర్వహిస్తారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి వన్‌ మిలియన్‌ చాలెంజ్‌ విన్నర్‌గా ప్రకటిస్తారు. 25న విజేతకు వన్‌ మిలియన్‌(రూ.కోటి) బహుమతిని అందజేస్తారు. ఫిన్‌టెక్‌కే భవిష్యత్‌ ఉందన్న విషయాన్ని చెప్పేందుకు వంద మంది నిపుణులను తరలిరానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ మద్నేష్‌కుమార్, మిశ్రా, యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా చైర్మన్‌ రాజ్‌కిరణ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ కీలకోపన్యాసాలు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బిట్‌లాండ్‌ గ్లోబల్‌ కార్యదర్శి క్రిస్‌ బేట్స్, గవర్నమెంట్‌ ఆఫ్‌ బ్లాక్‌ చైన్‌ అసోసియేషన్‌ ఇన్‌ లిమా డేవిడ్‌ సోటో, కార్డిటిక్స్‌ కో ఫౌండర్‌ లిన్నీ ల్యూబ్, సోసా సీఈవో యూజి చెఫర్, తదితరులు ప్రసంగించనున్నారు.
Leave a Comment