తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ. ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చీరెలను అక్టోబరు 12 నుంచి గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. గురువారం హైద్రాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కార్యాలయంలో మెప్మా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. మహిళాసంఘాల ప్రతినిధులు బతుకమ్మ చీరెలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరెను చిరుకానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. తెల్లకార్డు ఉండి 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ చీరెలను అందిస్తామని తెలిపారు. మొత్తం 95 లక్షల చీరెలు అవసరమవుతాయని అంచనా వేశామని.. వీటిలో 50 లక్షల చీరెలను ఆయా జిల్లాలకు చేరవేశామని చెప్పారు. మిగిలిన చీరెలను అక్టోబరు 10 నాటికి సరఫరా చేస్తామని వివరించారు. మొత్తం 80 రంగుల్లో చీరెలను తయారుచేశామని మంత్రి తెలిపారు. ఇవి చేనేత చీరెలు కావని, జరీఅంచు ఉన్న పాలిస్టర్ చీరెలని తెలిపారు. వీటన్నింటినీ సిరిసిల్లలోని మరమగ్గాలపై తయారుచేయిస్తున్నామని చెప్పారు. నాణ్యతలో రాజీపడటంలేదని, ఎలాంటి అసంతృప్తి తలెత్తకుండా ఉండేలా.. తయారీకి ముందుగానే మహిళాసంఘాలు, వివిధ వర్గాల మహిళల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు.
నేత కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తొమ్మిది గజాల చీరెలు కూడా కడుతారని, నిరుడు వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈసారి ఎనిమిది లక్షల చీరెలను ప్రత్యేకంగా తొమ్మిది గజాల నిడివి ఉండేలా తయారుచేయించామని వివరించారు. ఒక్కోచీరె తయారీకి రూ. 290 వ్యయమవుతున్నదని, ఇందుకోసం రూ.280 కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్, సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి, టెస్కో జీఎం యాదగిరి, సీడీఎంఏ అధికారి అనురాధ పాల్గొన్నారు.