హైద్రాబాద్ న్యూస్ ➤ భాగ్యనగరం సదర్ వేడుకలకు సన్నద్ధమైంది . తమ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా యాదవులు నిర్వహించే ఉత్సవం సదర్. ఈ సంబరం వచ్చిందంటే చాలు యాదవుల్లో సంతోషం అంబరాన్నంటుతుంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగే ఈ సదర్ ఉత్సవం నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతీసారి లాగే ఈ ఏడాది కూడా సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యాదవులు సిద్ధమయ్యారు. దీపావళి పండుగును పురస్కరించుకుని ఈ నెల 9న నారాయణగూడతో పాటు నగర శివారైన శంషాబాద్‌లోనూ సదర్ మేళాను జరపనున్నారు. నగరం నలుమూలల నుండి యాదవులు దున్నపోతులతో హాజరుకానున్నారు.ఈ సదర్‌మేళాకు ప్రపంచ ప్రసిద్ధి పొందిన మూడు హర్యానా దున్నలైన ప్రిన్స్ బాబు, విరాట్, కమాండో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రపంచ పోటీల్లో కమాండో దున్న చాంపియన్‌గా మొదటి స్థానంలో నిలిచింది. సదర్ మేళా రోజు ఇవి చేసే విన్యాసాలు నగరవాసులను అలరించనున్నాయి.
కాచిగూడ చెప్పల్ బజారులో సదరు వేడుకలకు ముస్తాబు చేస్తున్న దున్నపోతుల విన్యాసాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘాల నేతలు పాల్గొన్నారు. సదరు వేడుకలు యాదవులు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింబిస్తాయని తెలిపారు. బుల్స్ ఆలనాపాలనా చూసేందుకు నిత్యం ఆరుగురు కార్మికులు శ్రమిస్తుంటారు. వీటిని పోషించేందుకు ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇదంతా వంశ పారంపర్యంగా తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికే అంటున్నారు నిర్వాహకులు.
సదర్ మేళాలో పాల్గొన బోతున్న మరో హర్యానా దున్న వీర. దీని బరువు 9 వందల కిలోలు ఉంటుంది. మైలార్‌దేవ్ పల్లి వేదికగా జరగనున్న సదర్ వేడుకల్లో వీర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందంటున్నారు నిర్వాహకులు. రేపటి సదర్ వేడుకలు నగర వాసులనే కాదు…శివారు ప్రాంతాల ప్రజానీకాన్ని సైతం కనువిందు చేయనున్నాయి.