మరో రెండు ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో

తెలుగు న్యూస్ టుడే ➤ భారత దేశానికే అత్యంత ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో 2 ప్రయోగాలకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఈ ప్రయోగాలకు వేదికకానుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 14న సాయంత్రం జీఎస్‌ఎల్వీ మార్క్‌–3డీ2 ద్వారా 3,700 కిలోలు బరువు గల కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉపగ్రహంలో కేఏ ఎక్స్‌ కేయూ మల్టీభీమ్‌ అండ్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్స్‌ ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్‌ ఫాండర్లు పంపించడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి. గ్రామాల్లోని వనరులు, సదుపాయాలు, కావాల్సిన ఏర్పాట్లను గుర్తించి ఇది సమాచారం అందిస్తుంటుంది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (PSLV) ఇస్రోకు నమ్మకమైన అస్త్రంగా మారింది.  శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి ఇప్పటిదాకా పీఎస్‌ఎల్‌వీ ద్వారా 43 ప్రయోగాలు చేయగా… రెండు మాత్రమే విఫలమయ్యాయి. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి ప్రయోగాలతో పాటు ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు.. ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఘనత పీఎస్‌ఎల్‌వీ కే సొంతం. ఇప్పటిదాకా 43 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల ద్వారా 288 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఇందులో 241 విదేశీ ఉపగ్రహాలు, 47 స్వదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం. అలాగే దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఐదు చిన్నపాటి ఉపగ్రహాలను పంపించిన ఘనత కూడా పీఎస్‌ఎల్‌వీ దే. ఇతర దేశాల మీద ఆధారపడి ప్రయోగాలు చేసే దశ నుంచి.. ఇతర దేశాల ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి ఎదగడానికి పీఎస్‌ఎల్‌వీ రాకెట్టే కారణం. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా.. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపిస్తోంది. ఇస్రోకు వాణిజ్యపరంగా ఏడాదికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే కావడం విశేషం. ఇక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల చివరిలో పీఎస్‌ఎల్వీ సీ43 రాకెట్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ద్వారా హైపర్‌ స్పెక్ట్రల్‌ సిస్టం ఇమేజ్‌ శాటిలైట్‌(హైసిస్‌) ఉపగ్రహంతో పాటు 30 విదేశీ ఉపగ్రహాలను పంపించనున్నారు.

Leave a Comment