తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం

తెలుగు న్యూస్ టుడే ➤ శేషాచలం అడవుల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై నవంబర్ 1నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేదం విధించింది . ఇప్పటికే పరిశుభ్రతలో జాతీయ స్ధాయి అవార్టులు దక్కించుకున్న టీటీడీ.. తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ కవర్లపై పూర్తి స్థాయిలో నిషేదం విధించారు. తిరుపతి నగరంలో చాలా వరకు ప్లాస్టిక్ కవర్లు తగ్గిపోయాయి. తిరుపతి వాసులు కూడా క్లాత్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ లాంటి ప్రతామ్నాయ వస్తువులకు అలవాటుపడుతున్నారు. ఈ సమయంలో తిరుమలలో కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండడంతో తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను నిషేదించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
భక్తులు తమతో తెచ్చుకునే లగేజీలో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉంటున్నాయి. హోటల్స్.. షాపులు కూడా ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వాడుతున్నారు. టీటీడీ కూడా తను ఇచ్చే లడ్డూ ప్రసాదాల్లో ప్లాస్టిక్ కవర్లే వాడుతోంది. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలపై అంతర్జాతీయ స్ధాయిలో చర్చజరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల నిషేదంపై టి.టి.డి చర్యలు చేపట్టింది.

తిరుమలకి తూర్పువైపున శేషాచలం అడవుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో టీటీడీ చెత్తను ప్లాస్టిక్ కవర్లను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేస్తోంది. అయినా ఈ ప్లాస్టిక్‌ కవర్ల వల్ల పర్యవరణం దెబ్బతింటుందని తరచూ పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.

తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల నిషేదంపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీటీడీ. నిబంధనలు అతిక్రమిస్తే రూ.25 వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. రెండోసారి నిబంధన అతిక్రమిస్తే షాపు లైసెన్సు రద్దు చేస్తారు. స్వచ్చతిరుమలలో భాగంగానే ఈ నిర్ణయం అంటున్నారు టి.టి.డి. అధికారులు. తిరుమల వస్తున్న భక్తులకు కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

Leave a Comment