పోస్టల్ బ్యాలెట్‌ దరఖాస్తుకు నేటితో ఆఖరు

తెలుగున్యూస్ టుడే ➤తెలంగాణ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని శుక్రవారం లోగా ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొన్నైట్లెతే వారికి సంబంధించిన వివరాలను సంబంధిత జిల్లా అధికారికి అందజేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ధరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా నమోదు చేసుకున్నవారికి ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లోకి వచ్చే వాహనాల డ్రైవర్లు, క్లీనర్‌లు వారికి ఓటు హక్కు ఉన్న పోలింగ్ స్టేషన్, గ్రామం వివరాలను అందజేయాలని వారికి కూడా పోస్టల్ బ్యాలెట్‌లు అందజేస్తామన్నారు.

అదే విధంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎస్సై, కిందిస్థాయి పోలీస్ సిబ్బంది వివరాలు కూడా అందజేయాలన్నారు. ఒకే నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా ఏ పోలింగ్ స్టేషన్‌లో అయినా ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తే పోస్టల్ బ్యాలెట్‌ను అందజేస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ అందజేయవలసిన అవసరం ఉందన్నారు. శిక్షణ శిబిరం వద్ద ఓటు వేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని అంతే కాకుండా గెజిటెడ్ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రతి అభ్యర్థి ఓటరు గుర్తింపు కార్డు చూపి ధ్రువీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. జిల్లా అధికారులు తమ కిందిస్థాయి ఉద్యోగులకు తక్షణం సమాచారాన్ని అందించాలన్నారు. ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, శిక్షణలో భాగంగా అధికారులకు మాక్‌పోల్ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నందున ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Leave a Comment