తెలుగు న్యూస్ టుడే ➤ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ముందే జుమెరాత్ బజార్‌కు చెందిన రమేష్‌ని గొడ్డలితో నరికి అతిదారుణంగా చంపారు. అత్యంత రద్దీగా ఉండే పిల్లర్ నంబర్ 138 వద్ద నలుగురు వ్యక్తులు కలిసి రమేష్‌ని హత్య చేశారు. స్థానికులు, పోలీసులు కలిసి హత్య చేసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా ఈ హత్యతో ప్రమేయమున్న మరో ఇద్దరు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.
పాత కక్షల నేపథ్యంలో రమేష్ హత్య జరిగినట్టు తెలుస్తోంది. పది నెలల కిందట శంషాబాద్‌లో జరిగిన మహేష్ గౌడ్ హత్య కేసులో రమేష్ ప్రధాన నిందితుడు. ఈ కేసు విషయమై ఉప్పరపల్లి కోర్టుకు వస్తుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. కాగా, మహేష్ గౌడ్ తండ్రే రమేష్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.