ఆ స్కూల్లో విధులు నిర్వర్తించలేనని చెప్పిన హెచ్‌ఎం !

తెలుగు న్యూస్ టుడే ➤ ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఆ స్కూల్ ల్లో విధులు నిర్వర్తించలేనని చేతులెత్తేసిన వైనం , ఇది ఏ మారుమూల గ్రామాల్లో కాదు ఈ స్కూల్ ఉన్నది… గ్రేటర్ సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదీ తొలిస్థానంలో ఉన్న రాజ్‌భవన్‌ స్కూల్‌. పేరుకి రాజభవన్ స్కూల్ అయినా కూడా హెచ్‌ఎంకు కనీసం రూమ్‌ కూడా లేదని, రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని వాపోయారు ఇన్‌చార్జి హెచ్‌ఎం సుమన్‌ . ఇక్కడ విధులు నిర్వహించడం తనవల్ల కాదంటూ.. తనను ఆ స్కూలు నుంచి రిలీవ్‌ చేయాలని కోరుతూ డీఈఓ వెంకటనర్సమ్మకు రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అయితే డీఈఓ విజ్ఞప్తిని ఇప్పటికీ అంగీకరించలేదు. అయినప్పటికీ ఆయన గత 10 రోజుల నుంచే పేరెంట్‌ స్కూలు (బేగంపేట్‌ – 2)కు హాజరవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లోనే రాజ్‌భవన్‌ స్కూలును వీడి బేగంపేట్‌ స్కూలుకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజ్‌భవన్‌ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీపై వెళ్లిన విషయం విదితమే.

ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్‌ సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా విద్యాశాఖ 20మంది విద్యా వలంటీర్లతో పాటు సమీప పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఇక్కడ నియమించింది. ఇదే సమయంలో హెచ్‌ఎంగా బేగంపేట్‌ – 2 పాఠశాలకు చెందిన సుమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం పాఠశాలలో 1,300 మంది విద్యార్థులుడగా.. 10 మంది ప్రభుత్వ రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, 15 మంది విద్యా వలంటీర్లు ఉన్నారు. ఇక ప్రైమరీ సెక్షన్‌లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు 10 మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు.

Leave a Comment