కలుషిత 10 లక్షల డోసుల పోలియో చుక్కలను కాల్చివేత !

 

తెలుగు న్యూస్ టుడే ➤ ఘజియాబాద్‌ బయో మెడ్ ఫార్మా కంపెనీ తయారు చేసిన టైప్ 2 వ్యాక్సిన్ల కల్తీ మందులు ఇటీవలే కనుగొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను 2016 నుంచి సరఫరా చేస్తోంది సదరు కంపెనీ. అప్పటి నుంచి ఆ పోలియో మందు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లో సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆ వ్యాక్సిన్‌ను గత రెండేళ్ళుగా ఆయా రాష్ట్రాల్లో వాడుతూనే ఉన్నారు.

ఇటువంటి కలుషిత పోలియో చుక్కలను కాల్చివేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు లక్షల మంది చిన్నారులకు వీటిని వేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రుల్లో భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని చిన్నారుల రోగనిరోధకశక్తి అధికంగా ఉన్నందున వాటివల్ల ప్రమాదం ఏమీ ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఇంకా మిగిలిన వాటిలో కలుషితమైనట్లు భావిస్తున్న 10 లక్షల డోసుల పోలియో చుక్కలను జిల్లాల నుంచి ఆగమేఘాల మీద హైదరాబాద్‌కు తెప్పించారు. వాటిని ధ్వంసం చేసే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు లేఖ రాసినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ పోలియో చుక్కల బాటిళ్లను కాల్చివేస్తామని వైద్యాధికారి తెలిపారు.

కేంద్రం ప్రకటించిన బ్యాచ్‌ నంబర్‌ – బీ10048 గల కలుషిత వ్యాక్సిన్లు రాష్ట్రంలోనూ అనేకమంది చిన్నారులకు వేసినట్లు అధికారులు నిర్ధారించారు. వీటిని ఎంతమందికి వేశారో సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు అంటున్నారు. 10 లక్షల డోసుల పోలియో చుక్కలను వెనక్కి తేవడంతో రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో వాటి కొరత ఏర్పడింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ప్రమాదంలేని 3 లక్షల డోసుల పోలియో మందును రాష్ట్రానికి కేంద్రం పంపిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.వాటిని రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేశామని పేర్కొన్నాయి.

Leave a Comment