తెలుగు న్యూస్ టుడే ➤ నల్లగొండ ఘటన జరిగి వారం కూడా గడవకుండానే మరో తండ్రి తనకు ఇష్టం లేకుండా ప్రేమ పెండ్లి చేసుకున్నదనే కోపంతో మద్యం మత్తులో తన కూతురు, అల్లుడిపై హత్యాయత్నం చేశాడు. నవ దంపతులకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి పిలిపించి పథకం ప్రకారం వేట కొడవలితో కిరాతకంగా దాడిచేశాడు. బుధవారం హైదరాబాద్ నడిబొడ్డున ప్రధాన రోడ్డుపై వందల మంది చూస్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన నవ వధువు ప్రస్తుతం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికీ మాధవి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నదని వైద్యులు చెప్తున్నారు.
హైదరాబాద్ బోరబండలోని రాజ్‌నగర్‌కు చెందిన మనోహరాచారి పెద్ద కూతురు మాధవి(20) సనత్‌నగర్‌లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నది. ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్(21) కూకట్‌పల్లిలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐదేళ్ల వారి ప్రేమ, పెళ్లిగా మారింది . ఈ పెళ్లికి మాధవి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రక్షణ కోసం ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పెండ్లికి ఒప్పుకుంటున్నట్టు మనోహరాచారి పెద్దలను నమ్మించినట్లే నటించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాధవికి ఫోన్ చేసి కొత్త బట్టలు కొనిస్తానని, ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ దగ్గరికి రావాలని చెప్పాడు. మాధవి, సందీప్ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మనోహరాచారి.. తన బ్యాగ్‌లో దాచిపెట్టిన కొబ్బరిబొండాలు నరికే కత్తి తీసి ఒక్కసారిగా మాధవి, సందీప్‌పై దాడిచేశాడు.
డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం రాత్రి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. మాధవి తండ్రిని ఎంఎస్ మక్తాలో తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మనోహరాచారిపై ఐపీసీ 307, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని, రిమాండ్‌కు తరలించామని వివరించారు.