తెలుగు న్యూస్ టుడే ➤ ఆధునిక టెక్నాలజీని అనవసర, అభ్యంతరకర విషయాలకు మాత్రమే యువత ఉపయోగిస్తున్నారని అనేక మంది అభిప్రాయం. అయితే అదే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నగరంలోని సైబరాబాద్ పరిధిలో అత్యంత ప్రమాదకరమైన రహదారులను, సంబంధిత విశేషాలను గుర్తించి వాటిని నివారించే పనిలో ఉన్నవారికి ఉపకరించేలా ఓ మ్యాప్‌ను తయారు చేశాడు నగర విద్యార్థి జుబైర్‌ఖాన్. ఇతని పరిశోధన పత్రాలను ఇటీవలే ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్‌టెక్నికల్ ఇన్నొవేషన్ ఇన్ మోడ్రన్‌ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ప్రచురించింది.
అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ప్రమాదాలను నివారించలేకపోతున్నామనే బాధే నన్ను ఈ ప్రాజెక్ట్‌పై పనిచేసేందుకు పురికొల్పింది అని చెప్తున్నాడు . ఈ మ్యాప్ రూపకల్పనుకు మొత్తంగా ఏడాది సమయం పట్టిందని. దీని కోసం తొలుత 4 నెలల పాటు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్)సాఫ్ట్‌వేర్, జిపిఎస్ వంటి 4 రకాల సాఫ్ట్‌వేర్లపై పట్టు సాధించి అనంతరం ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్స్‌తో పాటు మరికొన్నింటి సాయం తీసుకుని, గూగుల్ ఎర్త్‌ను ఉపయోగించి నగరంలో ప్రమాదం జరిగే ప్రాంతాలను రోడ్ నెట్‌వర్క్‌ను గుర్తించాడు . ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రమాద నిలయాలైన మేడ్చల్, దుండిగల్, మియాపూర్, కీసర, ఉప్పల్, ఆదిభట్ల, కెపిహెచ్‌బి, శంషాబాద్, నార్సింగ్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాలను గుర్తించాడు . డేటా ప్రకారం వీటిలో ప్రమాదాల స్థాయిని బట్టి తక్కువ, మధ్యస్థం, ఎక్కువ, అత్యధికం ఇలా విభజించాడు. తాను గుర్తించిన ప్రమాదకర రహదారులు ఇవే !
సైబరాబాద్ పరిధిలోకి వచ్చే… చందా నగర్ నుంచి మియాపూర్, గచ్చిబౌలి నుంచి కెపిహెచ్‌బి, జీడిమెట్ల నుంచి మేడ్చల్, మీర్ పేట్ నుంచి ఇబ్రహీంపట్నం, మీర్‌పేట్ నుంచి వనస్థలి పురం, నార్సింగ్ నుంచి నానక్‌రామ్ గూడ, శంషాబాద్ వైపుగా వెళ్లే ఎన్‌హెచ్7 రోడ్స్, సాగర్ రింగ్ రోడ్ నుంచి రాజేంద్రనగర్… రహదారులు ప్రమాదాలకు కేంద్రాలుగా గుర్తించాడు . ఈ రోడ్ల మీద కేవలం ఒక్క ఏడాది (2017–18) లోనే 200కిపైగా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మద్యం తాగి డ్రైవ్ చేయడంతో పాటు గతుకుల రోడ్లు, వాహనాల వేగం, నిబంధనలు పాటించకపోవడ ంవంటి అనేక కారణాలు ఈ ప్రమాదాల వెనుక ఉంటున్నాయి. ప్రమాదాలకు సంబంధించిన ఈ డేటాని ఉపయోగించి ప్రమాదాలను – ట్రాఫిక్‌ను విశ్లేషించడానికి, భద్రతా స్థాయిలను గుర్తించడంలో ఇది సహకరిస్తుందని అతని అభిప్రాయం.