తెలుగు న్యూస్ టుడే ➤నందమూరి అభిమానులకు ఆదివారం అరవిందసమేత టీం పండుగ ఉత్సాహాన్ని నింపింది. ‘అరవింద సమేత’ సినిమా సక్సెస్ మీట్‌కు నందమూరి బాలకృష్ణ హాజరు అయ్యి తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా తారక్, కళ్యాణ్ రామ్‌లు భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రి ఇదిచూస్తే చాలా సంతోషించేవారని అన్నారు.
ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘అరవింద సమేత ఎట్టా ఉన్నాదీ? వీర రాఘవ ఎట్టా సేశాడు?’’ అంటూ రాయలసీమ యాశలో మాట్లాడారు. ఈ సినిమాలో క్లైమేక్స్ తనకు హైలెట్ అనిపించిందని, ఫుల్ ఎమోషనల్ టచ్‌తో త్రివిక్రమ్ ఈ సినిమా తెరకెక్కించారని తెలిపారు. జగపతిబాబు తమకు ప్రతి నాయకుడు కాదని తమ కుటుంబ సభ్యుడని అన్నారు. ఆ పాత్రలో మరెవ్వరినీ ఊహించలేమని కొనియాడారు. బాలయ్య గురించి మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమాతో ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న తమ బాబాయ్ బాలకృష్ణ తమ ఆనందాన్ని పంచుకోడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే, నాన్న లేని లోటు మాత్రం కనిపిస్తోందని, నాన్న ఇక్కడ ఉంటే బాగుంటుందని అనిపిస్తున్న తమకు బాబాయ్ ఆ లోటు తీర్చారని కళ్యాణ్ రామ్ భావోద్వేగంతో తెలిపారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నల్ల మబ్బు కమ్మిన మా కుటుంబంలోకి వెలుగును తెచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. ఈ ఆనందాన్ని మా బాబాయ్‌తో పాటు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చూస్తుంటారు. నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు హోదాలో వచ్చిన బాబాయ్‌కు నా హృదయపూర్వక పాదభివందనాలు’’ అని అన్నారు.