తెలుగు న్యూస్ టుడే ➤ తిరుమలలో కన్నుల పండువగా జరుగుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో(శుక్రవారం) ముగియనున్నాయి.
ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆలయ పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మళయప్పస్వామి వారు పుష్కరిణి చెంతకు ఊరేగింపుగా చేరుకున్నారు. ఉత్సవ మూర్తులకు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపన తిరుమంజనం ప్రక్రియను వేడుకగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ, వేలాది భక్తుల గోవిందనామస్మరణలతో చక్రతాళ్వారుకు పుష్కర స్నానం చేయించారు. శ్రీవారి పుష్కరిణిలో స్వామివారి చక్రస్నానం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంలో పుష్కరిణి మొత్తం భక్తులతో నిండిపోయింది. సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.