తెలుగు న్యూస్ టుడే ➤ మావోయిస్టుల చేతిలో హత్యకు గురి అయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు పరామర్శించారు. కిడారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పేద గిరిజనుల అభ్యున్నతి కోసం కిడారి సర్వేశ్వర్రావు అహర్నిశలు కృషి చేశారని ఆయన కొనియాడారు. ప్రజాప్రతినిధులను హత్యచేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి అరకు, పాడేరు వెళ్లి కిడారి మృతికి నివాళులర్పించారు. ఆయన కుటంబసభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పిన చంద్రబాబు.. ప్రభుత్వ పరంగా అన్నివిధాలా తోడుంటామని హామీ ఇచ్చారు. కిడారి చిన్న కుమారుడికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ పరంగానూ కిడారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కోటి రూపాయల ఆర్థికసాయం అందజేస్తామని, విశాఖలో ఇంటి నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఇక, ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కూడా విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ వేసింది. ఇప్పటికే అధికారులు సిద్ధం చేసిన నివేదికపై సీఎం సమీక్ష జరిపారు. ఇంటిలిజెన్స్ వైఫల్యంపై విమర్శల నేపథ్యంలో చంద్రబాబు దీనిపై ఉన్నతాధికారులతో చర్చించారు. దీనికి బాధ్యులను చేస్తూ పలువురు పోలీసు అధికారులపై చర్యలకు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైన నేపథ్యంలో.. సీఎం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ ఎస్పీపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది.