తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలు, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల కమిషన్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే ప్రాథమికంగా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నిత్యం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఫొటోలను, కూడళ్లలోని హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లను తొలగించే పని కొనసాగుతున్నది. ప్రభుత్వ భవనాలు, బస్సులు, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఉన్న పోస్టర్లను, గోడరాతలను చెరిపేస్తున్నారు. జిల్లాస్థాయిలో ఎన్నికల అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వాధికారులు మినహా మిగిలినవారెవరూ అధికారిక వాహనాలను వాడకూడదని, దీనిని ఉల్లంఘించేవారిపై కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.
ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను 24 గంటలూ స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా 1950 టోల్‌ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేసేందుకు వీలుకల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు తొమ్మిది తనిఖీ బృందాలను ఏర్పాటుచేశారు. దీంతో నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్టపడనున్నది. ఎన్నికల ప్రక్రియలో అనుభవమున్న అధికారులను తీసుకుని అన్ని పనులను వేగవంతం చేస్తున్నారు. కేంద్ర బలగాలను వినియోగించుకోవడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని మోహరించడంపై ప్రత్యేకంగా చర్చించారు. లైసెన్స్‌డ్ ఆయుధాలున్నవారి గురించి ఆరా తీయడంతోపాటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారితోపాటు కేసులు నమోదుచేసి రోజువారీగా నివేదికలను ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించినట్టు తెలిసింది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.