గుంటూరు జీజీహెచ్‌ శాఖలో నర్సుల సంఘం ఆందోళన !

తెలుగు న్యూస్ టుడే ➤ కర్నూలులో నర్సింగ్‌ సిబ్బంది చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా జీజీహెచ్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నర్సింగ్‌ వ్యవస్థలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్‌ నర్సింగ్‌ ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. 2016వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నర్సింగ్‌ అధికారులకు ప్రతి నెల రూ.20 వేల కనీస వేతనాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం గుంటూరు జీజీహెచ్‌ శాఖ నేతలు డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్టాఫ్‌ నర్సు అనే పదాన్ని తీసివేసి నర్సింగ్‌ అధికారి హోదాను కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నర్సింగ్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బందిని తక్షణమే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నర్సింగ్‌ విద్యార్థులకు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్టైఫండ్‌ పెంచాలన్నారు. నిరసన కార్యక్రమంలో నర్సుల సంఘం అధ్యక్షురాలు కావూరి అనూరాధ సూర్యకుమారి, సెక్రటరీ ఎం.ఆశాలత, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ కె.పుష్పావతి, హెడ్‌ నర్సులు, స్టాఫ్‌ నర్సులు, నర్సుల సంఘం నేతలు, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment