తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మ్రోగిందని తెలిసిందే , ఎన్నికల ఏర్పాట్లకు టెక్నాలజీని జోడిస్తోంది పోలీస్ డిపార్ట్ మెంట్. ఎన్నికల బందోబస్త్ సందర్భంగా విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది ఎవరెక్కడ ఉన్నారో క్షణాల్లో తెల్సుకునేలా ప్లాన్ చేస్తోంది. పోలీసులు వాడే మొబైల్ ఫోన్ జీపీఎస్ ను యాప్ తో జోడించి… అవసరమైన లొకేషన్ ను వెంటనే గుర్తించి… వారి నుంచి సమాచారం పొందే వీలు కలుగుతుందని డిపార్టుమెంట్ అనుకుంటోంది. ఈ యాప్ కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
ఎలక్షన్ జరిగేటపప్పుడు సిబ్బందిని మానిటర్ చేయడం చాలా అవసరం. డిసెంబర్ లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు కనీసం లక్ష మంది భద్రతా సిబ్బంది అవసరమవుతారని పోలీసు శాఖ అంచనా వేస్తోంది. వీరిలో సగం మంది రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఉంటే.. మరో సగం మంది ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి వచ్చి బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు. ఎస్పీ ఆఫీసులు, కమిషనరేట్లు వీళ్లకు విధులను కేటాయిస్తాయి. పోలింగ్ బూత్ ల దగ్గర సెక్యూరిటీ ఉన్నారా.. లేదా అనేది అప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ఉన్నతాధికారులకు వీలు కలుగుతుంది.
ఎన్నికల్లో బందోబస్త్ నిర్వహించే ప్రతి పోలీస్ ఫోన్ నంబర్ ను యాప్ తో లింక్ చేస్తారు. ఏ పోలింగ్ బూత్ దగ్గర ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా… గొడవ జరిగినా వెంటనే నేరుగా సెక్యురిటీ సిబ్బందితో మాట్లాడేేందుకు వీలు కలుగుతుందని.. అవసరమైన ఫొటోలు, వీడియోలు తెప్పించుకోవడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడానికి యాప్ పనికొస్తుందని డిపార్టుమెంట్ చెబుతోంది.