తెలుగు న్యూస్ టుడే ➤ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి రవాణాశాఖ త్వరలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. డ్రైవింగ్ లో శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నవారికి మొదట సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందే. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్ ద్వారా డ్రైవింగ్ మెళకువలను తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. లెర్నింగ్ లైసె న్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను సిమ్యులేటర్ శిక్షణకు ప్రోత్సహించేందుకు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ తెలిపారు. అనంతరం దశల వారీగా అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు విస్తరించాలని భావిస్తున్నామని తెలిపారు . మరోవైపు నామమాత్రపు శిక్షణ ఇస్తూ వినియోగదారుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్టవేయడంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవింగ్ స్కూల్లో సిమ్యులేటర్ శిక్షణ తప్పనిసరి చేయనున్నారు. తద్వారా ప్రాథమిక దశలోనే వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్ లో మెళకువలను నేర్పించడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
సిమ్యులేటర్ శిక్షణ :
➥ డ్రైవింగ్ పట్ల భయం తొలగిపోతుంది. ట్రాఫిక్ రద్దీ, వాహనాల రొద వంటి పరిస్థితుల్లో గందరగోళం లేకుండా వాహనం నడిపే అవగాహన ఏర్పడుతుంది.
➥ క్లచ్, గేర్,ఎస్కలేటర్, స్టీరింగ్, ఇండికేటర్, హెడ్‌లైట్, వైపర్లను ఎలా వినియోగించాలో, ఏ సమయంలో ఏం చేయాలనేది నేర్చుకోవచ్చు.
➥ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డుపైన ఏ ట్రాక్‌లో వాహనం నడపాలనే అంశం తెలుస్తుంది. ట్రాఫిక్ రద్దీ తీవ్రతకు అనుగుణంగా ట్రాక్‌లలో మార్పులు చోటు చేసుకుంటాయి.
➥ కుడి, ఎడమ ఇండికేటర్స్ ఎలా విని యోగించాలో తెలుసుకోవచ్చు. ‘యు’ టర్న్ తీసుకొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి.
➥ ఘాట్‌రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపైన సిమ్యులేటర్లు అవగాహన కల్పిస్తాయి.
వర్షాకాలం, మంచుకురిసే సమయాల్లో హెడ్లైట్లను తప్పనిసరిగా వేయాలి. వైపర్ల కండీషన్ ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సిమ్యులేటర్ శిక్షణ డ్రైవింగ్‌తో ముడిపడిన ప్రతి అంశంపైన అవగాహన కల్పిస్తుంది.
➥సిగ్నల్ పడిన సమయంలో ఎంత దూరంలో వాహనం నిలపాలి. పార్కింగ్ సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలి వంటి అన్ని అంశాలపైన యానిమేషన్ చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు.
➥వివిధ రకాల రోడ్లు, సైన్‌బోర్డులు, జాగ్రత్తలు, హెచ్చరికల సూచీకలపైన అవగాహన కలుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి.