గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి !

తెలుగు న్యూస్ టుడే ➤ మాజీ ఎంపీ, శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం చెందారు. వీరీ హఠాత్ మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి . అలస్కాలోని ఆంకరేజ్ సిటీలో ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కును మూర్తి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూర్తితో పాటు వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా , మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. కారు ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ఈనెల 6న కాలిఫోర్నియాలో గీతం పూర్వ విద్యార్థుల భేటీలో మూర్తి పాల్గొన్నాల్సి ఉంది. పార్థివదేహాలను భారత్‌కు పంపేందుకు తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది, పోలీసులతో ప్రసాద్ చర్చిస్తున్నారు. ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూతపై పలువురు రాజకీయ, విద్యారంగ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఎంవీవీఎస్ పూర్తి పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి. ఆయన 1939 జులై 3న జన్మించారు. మూర్తి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఐనవల్లి మండలంలోని మూలపాలెం గ్రామం. కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1991, 1999లో రెండుసార్లు విశాఖ ఎంపీగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన మూర్తి విద్యారంగంలోనూ విశేషసేవలందించారు. విశాఖ బాట్లింగ్ సంస్థను ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపారు. ఆయన గోల్డ్‌స్పాట్ మూర్తిగా అందరికీ సుపరిచితులు.

Leave a Comment