హైదరాబాద్‌ లో ఎన్నికల ప్రధాన కమిషనర్ సమావేశం

 

హైద్రాబాద్ న్యూస్ ➤ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే, ఈ ఎన్నికల పర్యవేక్షణకు సంభందించి ఢిల్లీ నుంచి సోమవారం ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ సహా హైదరాబాద్‌కు వచ్చిన పదకొండుమంది సభ్యుల బృందం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితిపై అంచనావేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులున్నాయని ఆయా పార్టీలు ఎన్నికల కమిషన్‌కు వివరించాయి.

ఇంతకుముందే ప్రకటించి అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు (ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు) అన్నీ కొనసాగించవచ్చని కేంద్ర ఎన్నికలసంఘం స్పష్టతనిచ్చింది. అయితే.. కొత్త పథకాలు చేపట్టకూడదని తెలిపింది. కొనసాగుతున్న అభివృద్ధి పనులను మధ్యలో ఆపాల్సిన అవసరంలేదని పేర్కొంది. దీనిప్రకారం రైతుబంధువంటి పథకాలు, రోడ్ల మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు యథాతథంగా కొనసాగుతాయి. ఇదే సమయంలో కొత్త పథకాలు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తే ఉపేక్షించబోమని, చర్యలు తీసుకుంటామని తనను కలిసిన రాజకీయపార్టీల నేతలకు ఎన్నికలసంఘం స్పష్టం చేసింది. ఓటర్లజాబితాలో అవకతవకలున్నాయని కాంగ్రెస్, టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశాయి. ఒక్కో రాజకీయపార్టీకి ప్రత్యేకంగా సమయం కేటాయించి, వేర్వేరుగా సమావేశాలు నిర్వహించిన ఎన్నికలసంఘం ప్రతినిధులు.. ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి, లేవనెత్తిన సమస్యలు, అభ్యంతరాలను విన్నారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం కానున్నది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలవరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో సమావేశమవుతుంది.

Leave a Comment