తెలుగున్యూస్ టుడే ➤ గత కొద్దిరోజులుగా.. ‘తితలీ’ తుఫానుతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ తుఫాను పెను బీభత్సానికి చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల కుటుంబాలు నివాసముండేందుకు ఇళ్లు లేక నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది. ‘తితలీ’ బాధితుల సహాయార్ధం యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి ఇండస్ట్రీలోని వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇలాంటి తరుణంలో కేరళకు స్పందించిన మాదిరిగానే తమకు తోచినంతగా సిక్కోలు ప్రజలకు సాయం చేసి ఆదుకోవాలని సినీ హీరోలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నడుంబిగించారు. ఇదివరకే టాలీవుడ్ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఇక్కడ్నుంచే సిక్కోలుకు సినీ ఇండస్ట్రీ సాయం మొదలైంది. అనంతరం విజయ్ దేవరకొండ తనవంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షల విరాళాన్ని, కల్యాణ్‌రామ్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.