గల్లీలోని ప్రజలంటేనే…మాకు భయం : కేటీఆర్ !

తెలుగు న్యూస్ టుడే ➤ ఎన్నికలు ఈ పేరు వింటేనే అటు రాజకీయ నాయకులకు ఇటు ప్రజలకూ పెద్ద పరీక్షే … ? మరోవైపు ప్రచారాల హోరులో పాలక పక్షం , ప్రతి పక్షం తలమునకలుగా శ్రమిస్తూ ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సనత్‌నగర్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్‌ ప్రతిపక్ష పార్టీలను మాటలతోనే కడిగేశారు . హైదరాబాద్‌ మినీ ఇండియా అని, అన్ని రకాల ప్రజలు ఇక్కడి గంగా జమున తహజీబ్‌కు అనుగుణంగా ప్రశాంతంగా కలసిమెలసి ఉంటున్నారని కొనియాడారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని షా చెప్పింది వింటే చిన్నపుడు దూరదర్శన్‌లో చూసిన ‘ముంగేరిలాల్‌ కే హసీన్‌ సప్నే’టీవీ సీరియల్‌ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ‘ఆయన అమిత్‌ షా కాదు. భ్రమల్లో బతికే భ్రమిత్‌ షా. ఉన్న 5 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటేనే ఎక్కువ’ అని అన్నారు. ఎన్నికల్లో అన్ని సీట్లు ఊడ్చేస్తాం.. పూడ్చేస్తాం అని కిషన్‌రెడ్డి అంటున్నారని, హైదరాబాద్‌లో 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నా ఒక్క కార్పొరేటర్‌ను గెలుచుకోలేకపోయారన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. ‘కేసీఆర్‌ ఒవైసీకి భయపడతాడని అమిత్‌షా అంటాడు. మేము ఒవైసీకి, మోదీకి భయపడం. భయపడితే గల్లీల్లోని ప్రజలకు భయపడతం. ఒవైసీలు, మోదీలు మాకు బాసులు కారు’ అని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒకరు మతాలు, మరొకరు ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు
అచ్చేదిన్‌ తెస్తామని చెప్పి ప్రజలు సచ్చే దిన్‌ తీసుకొచ్చారని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని కేటీఆర్‌ తూర్పారబట్టారు. సొంత పైసల కోసం బ్యాంకుల వద్ద బిచ్చగాళ్లలా అడుక్కునే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. బీజేపీ పాలనలో ఏ బ్యాంకు మూతబడుతుందో, ఎవడు డబ్బులతో ఉడాయిస్తాడో తెలియక బ్యాంకుల్లో డబ్బులు దాచుకోడానికి ప్రజలు భయపడుతున్నారన్నారు.
Leave a Comment