బిడ్ద కోసం ఎయిర్ అంబులెన్సు !

తెలుగు న్యూస్ టుడే ➤ కన్న బిడ్డ కోసం ఓ తండ్రి ఆరాటం ఏకంగా ఎయిర్‌ అంబులెన్స్‌లో బిడ్డని మెరుగైన వైద్యం కోసం తరలించి కాపాడుకున్నారు . ఇది ఏ విదేశాలలో కాదు ఈ అరుదైన ఘట్టానికి ఆదివారం ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రి వేదికయింది. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న తన బిడ్డ కోసం ఓ వ్యాపారి ఏకంగా ఎయిర్‌ అంబులెన్స్‌ను తెప్పించుకున్నారు.
ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు పదిలంగా తీసుకెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రమోద్‌ కొన్నేళ్లుగా ఒంగోలులో ఉంటున్నారు. ఆయన భార్య ప్రియాంక ఆరు నెలల గర్భిణి. ఉమ్మనీరు పోతుండటంతో ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య నిపుణులు వి.ప్రశాంతి, ప్రణీత్‌లు పరీక్షించి నెలలు నిండాకుండానే ప్రసవమవుతుందని తేల్చారు. తల్లీబిడ్డల పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వివరించారు. దంపతుల అంగీకారంతో ఈనెల 14న ప్రసవం చేశారు. మగబిడ్డ 700 గ్రాముల బరువుతో జన్మించాడు. బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్‌ సాయంతో చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ కిమ్స్‌కు బిడ్డను తీసుకువెళతామని తల్లిదండ్రులు వైద్యులకు విన్నవించారు. వైద్యుల సూచనల మేరకు బిడ్డ తండ్రి హైదరాబాద్‌ నుంచి ఎయిర్‌అంబులెన్స్‌ను తెప్పించారు. ఆదివారం ఉదయం ఆరింటి సమయంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. ఎయిర్‌అంబులెన్స్‌లో కిమ్స్‌ ప్రతినిధులు అత్యవసర వైద్య సౌకర్యాలను అమర్చి వైద్యుడిని వెంట పంపారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌లో మరిన్ని అధునాతన సౌకర్యాల మధ్య బాబు కోలుకుంటున్నాడని ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు .
Leave a Comment