జనసేనకు షాకిచ్చిన గ్రామస్తులు … ?

తెలుగు న్యూస్ టుడే ➤ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామస్తులు పెద్ద షాకిచ్చారు. ఏలూరు రూరల్‌ మండలం గుడివాకలంకలో పవన్‌ కళ్యాణ్ పర్యటనను గ్రామపెద్దలు బహిష్కరించారు. అంతేకాకుండా పవన్ పర్యటనలో ఎవరైనా పాల్గొంటే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది.
ఇటీవల రెండో విడతగా పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈసారి అధికార పార్టీ నేతలే టార్గెట్‌గా పవన్‌కల్యాణ్ తన ప్రసంగంతో విమర్శల దాడి చేశారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీధి రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగేతర శక్తులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గుండాయిజం చేస్తూ రాజకీయం చేద్దామనుకుంటే ఖబడ్దార్ అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. చట్టాలు సక్రమంగా పనిచేస్తే రౌడీ ఎమ్మెల్యేలంతా జైల్లో ఉంటారన్నారు. ఆకు రౌడీలు, వీధి రౌడీలను పదహారేళ్ల వయసులోనే చూశానన్నారు. ఆడపడుచులతో అమర్యాదగా ప్రవర్తిస్తే కాళ్లు విరిచి ఇంట్లో కూర్చోపెడతామని జనసేన తరఫున పవన్ హెచ్చరికలు చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అంతే ధీటుగా చింతమేని బదులిచ్చారు. తాను రౌడీనంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తనను నాణేనికి ఓ వైపే చూశారని, రెండో వైపు కూడా చూసి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Leave a Comment