శ్రీవారి లడ్డూలు ప్రక్క దారి !

తెలుగు న్యూస్ టుడే ➤ తిరుమల తిరుపతి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అదనపు లడ్డూలు కల్పించిన వెసులుబాటును ఆసరగా చేసుకుని సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించిన వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. భక్తులకు రాయితీపై అందించే లడ్డూలను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దారి మళ్లించినట్టు అనుమానం రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ధర్మదర్శనం భక్తులకు రాయితీపై రూ.20కి 2, అదనంగా మరో రెండు లడ్డూలు కావాలంటే రూ.50 చెల్లించి మొత్తం రూ.70కి నాలుగు లడ్డూలను టీటీడీ అందజేస్తుంది. యాత్రికుల రద్దీ సమయంలో సాంకేతిక కారణాలతో లడ్డూ టోకెన్లు స్కానింగ్‌ కాకపోయినా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం అందజేయాలని అధికారులు ఆదేశించారు.

దీన్ని తమకు అనుకూలంగా మలచుకుని 16 వేల లడ్డూలను వివిధ బ్యాంకుల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దారి మళ్లించారు. ఇప్పటి వరకు 4 వేల లడ్డూల విక్రయానికి సంబంధించి ఆధారాలు లభించగా, మరో 12 వేలకు లెక్కలు తేలాల్సి ఉంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇతర రద్దీ రోజుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులు  విచారణ సాగిస్తున్నారు . అక్టోబరు 14 నుంచి 16 వరకు 30 వేల లడ్డూలను టోకెన్లు లేకుండా భక్తులకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. వీటిలో 14 వేల లడ్డూలను పక్కకు మళ్లించి సొమ్ము చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రశ్నించినట్టు టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారి తెలిపారు.

Leave a Comment