పేరం గ్రూప్ సంస్థల్లో ఐటీ సోదాలు

తెలుగు న్యూస్ టుడే ➤ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే స్వల్ప కాలంలో భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను ప్రారంభించిన పేరం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ కార్యాలయాలపై మంగళవారం ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని ఆ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గత రెండేళ్ల నుంచి ఈ కంపెనీ భారీగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ప్రారంభించడం, పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తాలు పేరం గ్రూపులోకి వచ్చినట్లు ఆధారాలు లభించడంతో ఈ సంస్థపై సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, విశాఖలోని కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి.

పేరం గ్రూప్ సంస్థ సీఈవో పేరం హరిబాబు నివాసం తిరుపతి విద్యానగర్‌లోని ఇంటిలో కూడా భారీ ఎత్తున బంగారం, వజ్రాలు బయట పడ్డాయి. వీటి విలువను లెక్కించడానికి స్థానిక జ్యూవెలరీ షాపు ఉద్యోగి సహాయాన్ని తీసుకున్నారు. సీజ్‌ చేసిన బంగారం విలువ ఎంతన్నది తెలియాల్సి ఉంది. తిరుపతిలోని కార్యాలయం, హరిబాబు బంధువుల ఇళ్లు, ఆయన స్వగ్రామం పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరిలో సైతం విస్తృతంగా సోదాలు చేశారు. ఆదాయపు పన్నుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజ మోహన్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎనిమిది మంది, గోవర్ధనగిరిలో నాలుగురు ఐటీ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో భూ లావాదేవీలకు సంబంధించి పెద్ద సంఖ్యలో విలువైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న పేరం గ్రూప్‌ ప్రధాన కార్యాలయంలో రెండు బృందాలు నిర్వహించిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించి పెద్దఎత్తున ఆధారాలు లభించినట్లు సమాచారం. హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని కార్యాలయంలో సిబ్బందిని బయటకు పంపి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Leave a Comment