వై ఎస్ జగన్ పై యువకుడు కత్తి దాడి

తెలుగు న్యూస్ టుడే ➤ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై వైజాగ్ విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగింది. ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో జగన్ కూర్చొని ఉండగా.. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ఆయన వద్దకు వచ్చాడు. సెల్ఫీ దిగుతున్నట్లు నటించిన ఆ దుండగుడు.. జగన్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. జగన్ చేతికి గాయమైంది. జగన్‌పై దాడి చేసిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ భుజానికి గాయం కావడంతో.. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ కు బయల్దేరారు.

వైఎస్ జగన్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని వెయిటర్ శ్రీనివాస్ రావుగా పోలీసులు గుర్తించారు. విమానాశ్రయం లాంజ్ లో ఉన్న రెస్టారెంట్ లో శ్రీనివాస్ రావు వెయిటర్ గా పని చేస్తున్నాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో జగన్ పై శ్రీనివాస్ రావు దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జగన్ పై చేసిన దాడిని ఆ పార్టీ నాయకురాలు రోజా తీవ్రంగా ఖండించారు. ప్లాన్ ప్రకారమే జగన్ పై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. దాడి చేసిన కత్తికి ఏం పూశారో? అని రోజా అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మద్దతుతోనే జగన్ పై దాడి జరిగిందన్నారు. శ్రీనివాస్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

Leave a Comment