ఉప్పల్ స్టేడియంలో పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి

తెలుగు న్యూస్ టుడే ➤ భారత్ – వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం (అక్టోబర్ 12 )న ఆరంభం కానున్న ఈ మ్యాచ్‌ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెస్టులోనూ భారత్ ఘన విజయం సాధించే అవకాశం ఉండగా..తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం కనిపస్తుంది. దీంతోపాటు టెస్ట్ జరిగే ప్రతిరోజూ నాలుగువేల మంది స్కూల్ విద్యార్థులకు ఉచితప్రవేశం కల్పిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించిన నేపథ్యంలో స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పరిశీలించారు. మ్యాచ్ భద్రత కోసం 1500 మంది సిబ్బందిని మొహరించనున్నారు. వీరిలో రక్షణ సిబ్బంది 250, ట్రాఫిక్ పోలీసులు 150, సివిల్ పోలీసులు 519, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది నలుగురితోపాటు ఆక్టోపస్ విభాగాలకు చెందిన నలుగురు ఈ మ్యాచ్‌కోసం పని చేయబోతున్నట్లు ఆయన వివరించారు. స్టేడియం చుట్టూ, పార్కింగ్ స్థలాల్లో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్‌కు తరలివచ్చే అభిమానుల కోసం 16 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేసినట్లు భగవత్ తెలిపారు.

మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే మహిళలు,యువతుల రక్షణ కోసం ఈవ్‌టీజర్ల ఆటకట్టించేందుకు షీ టీమ్స్ బృందాలతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. మ్యాచ్‌కు ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచి అభిమానులు స్టేడియంలోకి అనుమతిస్తామని, స్టేడియం వద్ద ఎలాంటి బాణాసంచా కాల్చవద్దని సీపీ స్పష్టం చేశారు. స్టేడియంలోకి కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తామని, ఇయర్‌ఫోన్స్, పవర్‌బ్యాంక్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్టేడియంలోపలకు అనమతించమన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న రోజుల్లో ఎల్బీనగర్, వరంగల్ మార్గాల్లో ప్రయాణించే భారీ వాహనాల రూటును దారి మళ్ళిస్తారు. అదే విధంగా ప్రేక్షకులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించి ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా సహకరించాలని సీపీ మహేష్ భగవత్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమ మహేశ్వర శర్మ, ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్‌రావు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment